లండన్: ఈ బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడవ టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అయిన మార్క్ వుడ్ భుజం గాయంతో భారత్ తో జరిగే మూడవ టెస్ట్‌కు దూరమయ్యాడు. భారత్ తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో మార్క్ వుడ్ గాయపడ్డాడు. అయితే అతను మూడవ టెస్ట్ సమయానికి కోలుకోగలడని ఈసీబీ యాజమాన్యం భావించింది.
కాగా మార్క్ వుడ్ ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో మూడవ టెస్ట్‌కు జట్టులో అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ మార్క్ వుడ్ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడానికి దృష్టిసారిస్తాడని తెలిపింది. అయితే మూడవ టెస్ట్ తరువాత మార్క్ వుడ్ కి ఇంకోసారి ఫిట్నెస్ పరీక్ష చేస్తామని, అప్పటి పరిస్థితిని బట్టి సిరీస్ లో ఆడతాడా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అయితే ఈ పాటికే స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను గాయాల కారణంగా కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు వుడ్‌కు తగిలిన గాయం వల్ల మరింత సమస్యల్లోకి నెట్టింది. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌ల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.