చిలకలూరిపేట: వైసీపీకి చెందిన మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, సి. రామచంద్రయ్యలు బయటకు వచ్చి టీడీపీ లేదా జనసేనకు చేరి తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇదే తరహాలో మర్రి రాజశేఖర్ కూడా తన రాజకీయ దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ 2014లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ కొత్త నేత విడదల రజనీకి టికెట్ ఇచ్చారు.
ఈ పరిణామం మర్రి వర్గానికి ఆందోళన కలిగించింది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీ ఓటమి పాలైన తర్వాత, తన సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటకు తిరిగి రావాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం మర్రి వర్గాన్ని మరింత చిక్కుల్లోకి నెట్టింది.
విడదల రజనీ చిలకలూరిపేట బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ వైసీపీలో ఉన్న అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. బలమైన నాయకత్వాన్ని ఆశించే మర్రి వర్గం ప్రస్తుతం టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అలాగే బీజేపీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.