న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ / మార్కెట్లలో రారాజు అయిన మారుతి సుజుకీ తొలిసారి కరోనా మహమ్మారి వల్ల నష్టాలు నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.268 కోట్ల నష్టం చవిచూసింది. 2003 జూలైలో కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లలో లిస్ట్ అయిన తర్వాత నుండి నష్టాలు ఎదుర్కోవడం మొదటిసారి.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ త్రైమాసికంలో మారుతి రూ.1,377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను చూడగా, కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపినట్టు తెలుస్తోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.18,739 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పరిమితమైంది. వాహన విక్రయాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయి.
వీటిల్లో స్వదేశీ విక్రయాలు 67,027 వాహనాలు, 9,572 వాహనాలను ఎగుమతి చేసింది. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఈ కాలంలో కంపెనీ విక్రయాలు 4,02,594 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ త్రైమాసికం. కరోనా తీవ్రత వల్ల ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అధిక సమయం ఉత్పత్తికి, అమ్మకాలకు అవకాశం లభించలేదు.
మా మొదటి ప్రాధాన్యత ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే. దీంతో జూన్ త్రైమాసికంలో చేసిన మొత్తం ఉత్పత్తి సాధారణ రోజుల్లో అయితే రెండు వారాల ఉత్పత్తికి సమానం’’ అని మారుతి సుజుకీ ఒక ప్రకటనలో వివరించింది. కరోనా ముందస్తు కార్యకలాపాల స్థాయికి చేరువ అవుతున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకీ స్టాక్ బీఎస్ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.6,186 వద్ద ముగిసింది.