హైదరాబాద్: కాచిగూడలో జరిగిన భారీ దొంగతనం లో 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదు చోరీ అయ్యాయి.
మత్తు మందుతో దోపిడీ
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ (Kachiguda) ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. వ్యాపారవేత్త హేమరాజ్ (Hemraj) ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ (Nepal Gang) ఇంట్లోనే మత్తు మందు కలిపి దంపతులను ఏమార్చి దొంగతనానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుల కుట్ర
బుధవారం రాత్రి వ్యాపారవేత్త దంపతులకు వడ్డించిన ఆహారంలో మత్తుమందు కలిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నిందితులు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు హేమరాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం – ఇంట్లో ఉన్న రెండు కిలోల బంగారం మరియు రూ.3 కోట్ల నగదు దోపిడీకి గురైంది.
ఉదయం విషయం వెలుగులోకి
హేమరాజ్ రోజు లాగే ఉదయం వాకింగ్‌కు రాకపోవడంతో ఒక స్నేహితుడు ఇంటికి వచ్చాడు. అప్పటికే హేమరాజ్ దంపతులు స్పృహతప్పిన స్థితిలో ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం వారిని హైదర్‌గూడ (Hyderguda) లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుల కోసం ప్రత్యేక బలగాల గాలింపు
ఈ ఘటనపై కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా, తూర్పు మండల డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నేపాల్ వలస కార్మికులైన నిందితులు ఇప్పటికే పరారైనట్లు భావిస్తున్నారు.