ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియను జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయ్యేలోపు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.
సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ప్రజలు విసిగి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి పాలన, సంక్షేమం, అభివృద్ధిని అందించడమే లక్ష్యమని చెప్పారు.
డీఎస్సీ భర్తీని ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేపడతామని స్పష్టం చేశారు. ఈసారి భారీగా పోస్టులను భర్తీ చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. దీంతో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు.
అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామన్నారు. అమరావతిని ప్రపంచంలోనే ఉత్తమ మోడల్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలు కీలక ప్రకటనలు చేస్తూ ఉద్యోగార్థులకు ఆశావహ సంకేతాలిచ్చారు.