మెగా రిలీజ్‌లపై మళ్ళీ మౌనం
మెగా హీరోల సినిమాలపై అభిమానుల్లో విపరీతమైన హైప్ ఉన్నప్పటికీ… రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మొదట సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం చివర్లో వాయిదా పడింది.
తాజాగా మే 9 అనే వార్తలు వచ్చినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. డిజిటల్ డీల్స్ మరియు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ రాకపోవడం వల్ల విడుదల తేదీ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పరిస్థితి కూడా ఇంతే. దర్శకుడు జ్యోతి క్రిష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా 12 రోజులు మిగిలి ఉంది.
రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ ఈ సినిమా పూర్తి చేయలేకపోతున్నారు. మే 9న విడుదల అవుతుందన్న వార్తలు ఉన్నప్పటికీ అదే రోజు తమ్ముడు, సింగిల్, భైరవం సినిమాలు విడుదల కాబోతుండటంతో పోటీ పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ సినిమా ప్రొమోషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావాల్సి ఉండటంతో వాయిదా అనివార్యమవుతుందా అన్న ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్టు, త్వరలో క్లారిటీ ఇవ్వకపోతే ఈ రెండు సినిమాలపై ఉన్న బజ్ తగ్గే ప్రమాదం ఉంది. మెగా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.