హైదరాబాద్: కరోనా కేసులు అధికంగా పురుషులకే వస్తున్నాయి. జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటం, ఇంకా తదితర కారణాలతో పురుషుల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 99,03,125 మందికి పరీక్షలు చేయగా, అందులో 3,05,309 మందికి కరోనా సోకింది. గురువారం 57,548 మందికి పరీక్షలు చేయగా, 518 మందికి కరోనా సోకినట్లు తేలిందని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 157 మంది కరోనా బారినపడ్డారు. గురువారం 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,631 మంది కోలుకున్నారు. తాజాగా ముగ్గురు చని పోగా, ఇప్పటివరకు 1,683 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,995 ఉండగా, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,767 మంది ఉన్నారు. గురువారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు 3,49,989 మంది టీకా వేయించుకున్నారు.
వ్యాధిగ్రస్తులు 1,72,928 మంది టీకా పొందారు. ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 8,54,509 మంది. రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,30,582 మంది ఉన్నారు. గురువారం 60 ఏళ్లు పైబడిన 20,516 మందికి మొదటి డోస్ వేయగా, వ్యాధిగ్రస్తుల్లో 13,178 మందికి టీకా వేశారు.