మ్యునీచ్: విద్యుత్ వాహనాల విభాగంలో పేరొందిన కంపెనీ టెస్లా, ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఆదరణ చాలా ఉంది. కాగా ప్రపంచం మొత్తం మీద విద్యుత్ వాహన మార్కెట్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్న టెస్లా, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను ఏలుతోంది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా పేరొందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు చాలా వరకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ విషయమై జర్మనీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్ బెంజ్ నుంచి కొత్త విద్యుత్ వాహనాన్ని లాంచ్ చేసింది. మెర్సిడిజ్ ఈక్యూఈ పేరుతో ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో కంపెనీ ప్రదర్శనకు తెచ్చింది. ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీకి చెందిన టెస్లా ఎస్ మోడల్ కారుకు పోటీగా రానున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
2022 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ తన కారును కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క ఛార్జ్‌తో దాదాపు 660 కిమీ వరకు ప్రయాణం చేయవవచ్చునని కంపెనీ ప్రకటించింది. ఈ కారులో 90క్వ్హ్ బ్యాటరీని అమర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170క్వ్ బ్యాటరీని కూడా ఏర్పాటుచేసింది. దానితో పాటు 430 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా ఏర్పాటు చేసింది. మార్కెట్‌లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్ అవనుందని కంపెనీ తెలిపింది.