న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కేరళలో కేంద్రంలోని అధికార పార్టి భాజపా తెలివిగా పావులు కదుపుతోంది. కేరళ లో కమ్యూనిస్ట్ పాలనను అంతంచేసి, కాషాయ జెండాను పాతాలని ఉవ్విళ్ళూరుతోంది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు చెరమగీతం పాడి కేరళలో పాగావేయడానికి ప్రణాలిక రచిస్తోంది.
దీనిలో భాగంగానే మంచి పేరున్న వ్యక్తులను మరియు ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పార్టీలోకి చేర్చుకుంటోంది. ఈ క్రమంలో మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను బీజేపీలోకి చేర్చుకోవడానికి కమళనాథులు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విజయ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేందరన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఆయన భాజపా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రిబవరి 21న నుంచి కేరళలో విజయ యాత్ర ప్రాంభవుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు ఆయన్ని ఆహ్వానించామని తెలిపారు. సురేందరన్ ప్రకటనపై స్పందించిన 89 ఏళ్ల మెట్రోమ్యాన్ శ్రీధరన్, తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
కేరళ రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన చేస్తున్న యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమికి విధానాలకు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో మరో ఐదునెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది.