అబుదాబి: ఈ సీజన్లో తొలి గెలుపుతో ముంబై ఇండియన్స్ మురిసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయభేరి మోగించింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. టెయిలెండర్ కమిన్స్ (12 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రెండో ఓవర్లోనే డికాక్ (1) ఔటైనా, కెప్టెన్ రోహిత్ శర్మకు జతయిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. సందీప్ వేసిన మూడో ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. దీంతో స్కోరులో ఉన్నపళంగా వేగం పెరిగింది. కోల్‌కతా సారథి దినేశ్ కార్తీక్, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఖరీదైన బౌలర్ కమిన్స్‌ను రంగంలోకి దించిన ప్రయోజనం లేకపోయింది. అనుభవజ్ఞుడైన హిట్‌మ్యాన్ రెండు సిక్సర్లతో కమిన్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.
స్పిన్నర్ నరైన్‌కు బంతినప్పగిస్తే సూర్యకుమార్ ఫోర్లతో స్వాగతం పలికాడు. దీంతో ముంబై పవర్ ప్లేలో 59/1 స్కోరు చేసింది. దీంతో ఓవర్ ఓవర్‌కూ బౌలర్లను మార్చినా ముంబై స్కోరు, జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. అయితే ఏ బౌలర్‌కు లొంగని ఈ జోడీని రనౌట్ విడగొట్టింది. జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్ రనౌటయ్యాడు. దీంతో 90 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది.
తర్వాత క్రీజ్‌లోకి సౌరభ్ తివారీ రాగా, ‘హిట్‌మ్యాన్’ 39 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. స్పిన్నర్లను అవలీలగా ఎదుర్కొన్న రోహిట్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్ వేసిన 14వ ఓవర్లో మిడ్ వికెట్, లాంగాన్‌ల మీదుగా రెండు సిక్సర్లు బాదాడు. మరోవైపు ఖరీదైన బౌలర్ కమిన్స్‌కు రెండో స్పెల్‌లోనూ నిరాశ తప్పలేదు. ఈసారి తివారీ అతన్ని ఆడుకున్నాడు. వరుసగా 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లోనూ 15 పరుగులు సమర్పించుకున్నాడు. అలా 2 ఓవర్లలోనే అతను 30 పరుగులు ఇచ్చుకున్నాడు.
ముంబై నిర్దేశించిన లక్ష్యం 196. అంటే కోల్‌కతా సుమారు ఓవర్‌కు పది పరుగులు చొప్పున 20 ఓవర్లు ఆడితేనే ఛేదిస్తుంది. కానీ ఓపెనింగ్ వైఫల్యం, బాధ్యతలేని మిడిలార్డర్ వల్ల లక్ష్యానికి సరిపడ పరుగులు ఏ ఓవర్లోనూ చేయలేకపోయింది. శుబ్‌మన్ (7), నరైన్ (9) ఆరంభంలోనే ఔటయ్యారు.
25 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన నైట్‌రైడర్స్‌ను కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30; 5 ఫోర్లు), నితీశ్ రాణా (24; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు నడిపించారు. కానీ గెలిపించే భాగస్వామ్యమైతే నమోదు చేయలేదు. తర్వాత వచ్చిన వారిలో కమిన్స్ బుమ్రా బౌలింగ్‌లో నాలుగు సిక్సరల్తో మెరుపులు మెరిపించాడు. కానీ కొండంత లక్ష్యానికి అవే మాత్రం సరిపోలేదు.