న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోంను ఇకపై వాళ్ళకు శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ శనివారం ప్రకటించింది. అయితే ఈ అవకాశం కొన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా వైరస్ మహమ్మారి బారిన ఉద్యోగులు పడకుండా ఉండేందుకు ఇప్పటికే పలు ఐటీ కంపెనీలతో సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. వర్క్ ఫ్రం హోంతో మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర కంపెనీలు లాభపడినప్పటికి కోవిడ్ ప్రభావం తగ్గగానే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
కాగా మైక్రోసాఫ్ట్ తన ప్రకటనలో హర్డ్‌వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాలలో పని చేస్తోన్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అలా చేయాలనుకుంటున్న ఉద్యోగుల ఆయా విభాగాలకు చెందిన తమ మేనేజర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇంకా ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు కూడా తెలిపింది. ఆమెరికాలో పని చేస్తున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లి పని చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. అంతేగాక అమెరికాలోని ఉద్యోగులు కుడా సొంత ప్రదేశాలకు వెళ్ళ వచ్చని ప్రకటించింది. అయితే వేతనాల్లో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయని, ఇందుకోసం మేనేజర్ నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.