అమరావతి: ఏపీలో నైపుణ్య శిక్షణను విద్యార్థి దశ నుంచే బృహత్తర కార్యానికి ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర ఆ సంస్థతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీఎక్స్‌వో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, నైపుణ్య శిక్షణకు సంబంధించి ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో పలుమార్లు చర్చలు జరిపామని, శిక్షణ అందించే కోర్సులను కూడా ఈ పాటికే గుర్తించామని తెలిపారు. సాధారణ రుసుముతో ఏటా 1.60 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చే కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనురులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసమే డిగ్రీ సిలబస్‌ను నాలుగేళ్లకు మార్చడమే కాక 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసినట్లు సతీష్‌చంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ, వ్యవసాయం, విద్య, వైద్య, స్మార్ట్ సిటీ వంటి ఆరు ప్రధాన రంగాలతో ఐటి అనుసంధానం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచుకోగలుగుతామన్నారు.
రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐటీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ–క్రాపింగ్, మార్కెటింగ్ వంటి వాటిల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తున్నామని
కరోనాతో కాంటాక్ట్ లెస్ టెక్నాలజీపై అందరి దృష్టిపడిందని, ఆఫీసుకు వెళ్లకుండానే ఐటి టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటుకు అందరూ ఆకర్షితులవుతున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వున్న మానవ వనరులను వినియోగించుకుని సాంకేతికంగా వారిలో నైపుణ్యాన్ని పెంచగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు.