టాలీవుడ్: అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అయిందో ఎప్పుడు షూటింగ్ ఫినిష్ అయిందో లాంటి విషయాలేవీ తెలియకుండా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల ప్రకటన చూసి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే ఒక సినిమా ఉందని చాలా మందికి తెల్సింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ‘ఆనంద్ దేవరకొండ’, 96 ఫేమ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ సినిమా నిన్ననే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. వినోద్ ఆనంతోజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికి వస్తే ఒక పల్లెటూర్లో తల్లి తండ్రులతో ఉండి చిన్న హోటల్ నడుపుకునే
ఒక మధ్య తరగతి యువకుడు తన దగ్గరి టౌన్ లో హోటల్ పెట్టి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన ప్రయత్నం లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు చివరకి తన కల తన ప్రేమని ఎలా జయించాడు అనేది కథ. కథ సింగల్ పాయింట్ ఏ అయినా పెద్ద స్క్రీన్ ప్లే మ్యాజిక్స్ ఏమి లేకపోయినా కానీ కథనం విషయం లో డైరెక్టర్ బాగా ట్రై చేసారు. ప్రేక్షకుడికి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వచ్చే ప్రతి పాత్ర ఎంతో కొంత వరకు కథకి న్యాయం చేసేలా రాసుకున్నాడు. చిన్న చిన్న ఊళ్లలో టౌన్స్ లో ఉండే అనుబంధాల్ని, చిట్ ఫండ్ మోసాల్ని దాదాపు ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు. ఈ సినిమాకి గుంటూరు బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న దర్శకుడు యాస విషయం లో కూడా చాలా జాగ్రత్తలు పడ్డాడు.
నటీ నటుల విషయానికి వస్తే హీరో కన్నా ముందుగా చెప్పుకోవాల్సిన పాత్ర హీరో తండ్రి పాత్ర. చాలా కోపం ఎక్కువగా ఉండి బూతులు ఎక్కువ మాట్లాడుతూ అవసరం అయిన చోట తండ్రి ప్రేమని చూపిస్తూ సినిమాలో ఆద్యంతం అలరించాడు. ఇలాంటి వాల్లని నిజ జీవితం లో మనం చాలా మందిని చూస్తుంటాం. చాలా మంది ప్రేక్షకులు ఈ క్యారెక్టర్ కి ఈజీ గా కనెక్ట్ అయిపోతారు. హీరో ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా మీద ఈ సినిమాలో కొంచెం పరవాలేదనిపించాడు. వర్ష క్యారెక్టర్ తన వరకు ఆకట్టుకుంది కానీ తనకి ఇంకొంచెం స్క్రీన్ టైం ఇచ్చి ఉంటె బాగుండేది అనిపించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన నటుడు, అతని లవర్ క్యారెక్టర్ లో చేసిన నటి కూడా ఆకట్టుకుంది. మిగతా అన్ని పాత్రలు కూడా తమ తమ పాత్రల వరకు ఎక్కడ నెగటివ్ లేకుండా ఆకట్టుకున్నారు.
టెక్నిషియన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి మరియు నేపధ్య సంగీతం అందించిన ఆర్.హెచ్.విక్రమ్ . సినిమాకి ఇచ్చిన సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు అంతగా ఆకట్టుకోనప్పటికీ వినగా వినగా పర్వాలేదనిపించింది. కానీ నేపధ్య సంగీతం సినిమాకి సరిగ్గా కుదిరింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక పేరు సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి. గుంటూరు అందాలని చాలా బాగా చూపించాడు. సినిమా లో బడ్జెట్ మూవీ అయినా కూడా సినిమా నేపధ్యానికి తగ్గట్టు ఎక్కడ నిర్మాణ విలువలు తగ్గకుండా తీసినట్టు అనిపించింది. దర్శకుడు కథ విషయం లో కొత్తదనం ఏమి లేకపోయినప్పటికీ కథనం లో తన పట్టు చూపించి బోర్ కొట్టకుండా సినిమా ని నడిపించడంలో మంచి మార్కులు కొట్టాడు.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ అండ్ సాఫ్ట్ ఎంటర్టైనర్.