దుబాయ్: సగం లో ఆగిన ఐపీఎల్-14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ కొన్ని కీలక మార్పులను చేస్తోంది. ఒక రోజు క్రితం జట్టులోకి ముగ్గురు ఆటగాళ్లను కొత్తగా తీసుకున్న ఆర్‌సీబీ, తాజాగా ఇవాళ కోచ్ విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇప్పటి వరకు ఆర్‌సీబీకి హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన సైమన్ కటిచ్ తన వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండలేనని ప్రకటించారు. ఆ కారణం చేత టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా పని చేస్తున్న మైక్ హెసన్ మిగిలిన సీజన్ కు హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
అలాగే తన జట్టులో మూడు మార్పులను కూడా ఆర్సీబీ చేసింది. మొదటి దశలో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. కాగా వారి స్థానాల్లో తాజాగా శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను ఆర్సీబీ ఎంచుకుంది. టిమ్ డేవిడ్, సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ ను కూడా ఆర్‌సీబీ టీమ్‌లోకి ఎంపిక చేశారు.
అయితే ఇలా సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు బీసీసీఐ యొక్క ఐపీఎల్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా ఈ సారి ఐపీఎల్-14వ సీజన్‌లో ఆర్‌సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఐదు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.