తెలంగాణ లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన హామీని అమలు చేస్తూ, మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల ఉద్యోగుల జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ హామీ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కె. కేశవరావును సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ త్వరలోనే సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనుంది.
ఉపసంఘం ఏర్పాటు పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఈ చర్యలు చేపట్టడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉపసంఘం సమీక్షలు త్వరగా నిర్వహించి, ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.