తెలంగాణ: మీర్‌పేట లో ఘోరం జరిగింది. భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన భర్త పట్టుబడ్డాడు.
ఘోరమైన మర్డర్ కేసు
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్యకేసు వెలుగుచూసింది. నిందితుడు పుట్ట గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, దేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత కుక్కర్‌లో ఉడికించాడు. ఎముకలను రోట్లో పొడిచేసాడు. అనంతరం అవశేషాలను సమీప చెరువులో పడేశాడు.
కుక్కపై ట్రయల్..
పోలీసుల విచారణలో కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ ఘోరానికి ఒడిగట్టేముందు గురుమూర్తి ఓ కుక్కను చంపి, దానిని ముక్కలుగా నరికి ఉడకబెట్టినట్టు తెలిసింది.
అనుమానమే కారణమా..?
గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచూ గొడవలకు దిగేవాడు. ఇటీవల ఇంట్లో పిల్లలు లేని సమయంలో, జరిగిన ఓ గొడవ హత్యకు దారితీసింది అని తెలుస్తోంది. భార్యను చంపిన అనంతరం, మృతదేహాన్ని మాయం చేసిన అనంతరం ఏమీ ఎరగనట్టు అత్తా, మామలకు ఫోన్ చేసి మాధవి కనబడట్లేదు అంటూ వాకబుచేశాడు.
సీసీ కెమెరా ఆధారాలు
మాధవి మిస్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి బయట సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా, మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి కానీ, బయటకు వచ్చిన ఆచూకీ లేదు. దీనితో భర్త గురుమూర్తిపై అనుమానం వచ్చింది.
విచారణలో ఒప్పుకున్న నిందితుడు
గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొదటగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అనంతరం తన భార్యను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు మృతదేహం ఆనవాళ్లను వెతుకుతున్నారు.
కుటుంబం, స్థానికుల దిగ్బ్రాంతి
ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇద్దరు చిన్నపిల్లల తండ్రి చేసిన ఈ క్రూరమైన కసాయి చర్య నివ్వెరపోయే విధంగా ఉంది. కుటుంబ సభ్యులే కాకుండా, స్థానికులు కూడా ఈ ఘటనపై షాక్‌కు గురయ్యారు.
మరేమన్నా కారణాలు..?
భార్యాభర్తల మధ్య వివాదం కేవలం అనుమానంతోనే జరిగింది లేదా మరైన కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మర్డర్ ఎపిసోడ్‌లో నిందితుడికి ఎవరైనా సహకరించారా? అనే దిశలో దర్యాప్తు జరుగుతోంది.