తెలంగాణ: ఖమ్మం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిపై జరిగిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ములుగు జిల్లాకు చెందిన ఈ విద్యార్థి ఇటీవల కాలేజీలో చేరగా, హాస్టల్‌లోని తన సహ విద్యార్థుల సూచన మేరకు చైనీస్ స్టైల్ హెయిర్ కటింగ్ ట్రిమ్ చేయించుకున్నాడు.
కానీ ఇది యాంటీ రాగింగ్ కమిటీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ దృష్టికి చేరి, అతను ఆగ్రహంతో విద్యార్థిని బలవంతంగా సెలూన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు.
ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను 13న హాస్టల్ విధుల నుండి తప్పించారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించి, నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారు.
ఈ సంఘటనపై పూర్తి నివేదికను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కు పంపనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.