లక్నో: భారత ఉమెన్స్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఒక ఘనతను సాధించింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మిధాలి అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత్ అఉమెన్ క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
దేశంలోనే కాదు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్‌ను సాధించిన రెండవ క్రికెటర్‌గా రికార్డు సాధించింది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో అన్నే బోస్క్ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకుంది.
మొత్తంగా చూసుకుంటే మిథాలీ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు చేసింది. వీటిలో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా, టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్‌వర్డ్స్ మాత్రమే ఉండి తొలి స్థానంలో ఉంది.
ఇంగ్లండ్ తరపున ఎడ్‌వర్డ్స్ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 77 పరుగులతో రాణించగా, మిథాలీ, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు.