ఏపీ: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా హైకోర్టు నుంచి కొంత ఊరట పొందారు. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ జారీ చేసిన నోటీసులపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. తనను న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కోరగా, కోర్టు ఆ విజ్ఞప్తిని అంగీకరించింది.
విచారణ సమయంలో దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనను మిథున్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో, సిట్ కార్యాలయంలోకి న్యాయవాదులను అనుమతించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయవాదులు విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది.
విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని మిథున్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. కానీ సీసీటీవీ పరిధిలో విచారణ జరగాలని సిట్‌ను ఆదేశించింది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయానికి మిథున్ హాజరుకావాల్సి ఉంది.
ఇక ఇప్పటికే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు అరెస్ట్ పై తాత్కాలిక ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వుల వరకు అరెస్ట్ చేయరాదని, విచారణకు సహకరించాలన్న ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే.