ముంబై: తిరగబెట్టిన కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరొక ఎమ్మెల్యే మృరణించారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రావ్ సాహెబ్ అనంత్‌పుర్కర్ (64) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరనంతో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.
అనంత్‌పుర్కర్ మృతికి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన సంతాపం తెలిపారు. అతడి కుటుంబసభ్యులకు ధైర్యం ఇచ్చారు. మార్చి 19వ తేదీన అనంత్‌పుర్కర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. కరోనా సోకిన మొదట్లో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందగా కొద్దిరోజులకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు.
కాగా ఈ మధ్య ఆయనకు కరోనా నెగటివ్ అని తేలింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. అవయవాలు పని చేయకపోవడంతో ఏప్రిల్ 1వ తేదీన వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగించారు. వైద్యానికి ఆయన శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి శనివారం అనంత్‌పుర్కర్ కన్నుమూశారు.
కరోనా బారిన పడి గతేడాది ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భల్కే మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.