హైదారబాద్: తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్ కు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల నర్సింహయ్య (64) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.
30 సంవత్సరాల నోముల రాజకీయ, ప్రజా జీవితంలో మొదటసారిగా 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారు.
మూడో పర్యాయం 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసనసభ్యుడు గా కొనసాగుతున్నారు. సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు.
నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.