ఖమ్మం: ఈ రోజుల్లో అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్ ని బాగా వినియోగిస్తున్నాం. పైగా ఈ మహమ్మారి సమయంలో ఈ ఆన్లైన్ షాపింగ్ ఇంకా ఎక్కువైంది. అలా ఆన్లైన్ షాపింగ్లో ఆర్డర్ చేసి మోసపోయిన సందర్భాలు ఎన్నో. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది.
బుక్ చేసిన వస్తువు కాకుండా నకిలీ వస్తువులను, రాళ్లను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అలాగే ఒక సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. విచిత్రంగా ఈ సారి ఆర్డర్ చేసిన మొబైల్ కు బదులుగా ప్యాక్ లో లైఫ్‌బాయ్ సోపులు రావడం చూసి ఆర్డర్ చేసిన వ్యక్తి అవాక్కయ్యాడు.
బుర్హన్ పూర్‌కు చెందిన మంజుల అనే ఒక మహిళ అమెజాన్‌లో 10,400 రూపాయలు విలువ చేసే ఒక వివో సీ-15 మొబైల్ ఫోన్ ను బుక్ చేసింది. బుక్ చేసిన కొన్ని రోజులకు ఫోన్ కూడా డెలవరీ అయ్యింది. కానీ తీరా ప్యాకేజి ఓపెన్ చేసేటప్పుడు ఎందుకైన మంచిది అని ఆ ప్యాకేజి తెరుస్తూ వీడియో కూడా రికార్డు చేశారు.
మొబైల్ ఉంటుందని ఎంతో ఆతృతగా ఓపెన్ చేసి చూశాక తీరా అందులో రెండు లైఫ్‌బాయ్ సబ్బులు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి వెంటనే అమెజాన్ సంస్థకు పిర్యాదు చేశారు. అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల్లోనే ఇలా జరగటం తెలిసుకున్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వినియోగదారుడి ఫిర్యాదును స్వీకరించిన అమెజాన్ సంస్థ విచారణ చేస్తున్నట్లు తెలిపింది.