న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలొ ఇంధన ధరలు మరియు నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందిపడుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు త్వరలో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి పిడుగు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ల టారిఫ్ రూపంలో పడనుంది. ఇప్పటికే పలు టెల్కోలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను భారిగా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇలా మొబైల్ చార్జీల పెరుగుదలతో సామాన్య ప్రజానీకానికి మరింత భారం అవనుంది. ఇటీవలే ఎయిర్‌టెల్ సంస్థ తమ వినియోగదార్ల కోసం రూ. 49 బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను ఒకేసారి రూ. 79 కి పెంచింది. దేశంలో ఈ బేసిక్ ప్లాన్ ను వాడుతున్న సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ బాటలోనే వి (వోడాఫోన్-ఐడియా) కంపెనీ కూడా తమ టారిఫ్‌లను పెంచే ఆలోచనతో ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. వి ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను ఆపేసింది. ఆ ప్లాన్ స్థానంలో నూతనంగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
కాగా టెల్కోలు రానున్న 6 నెలల్లో ఈ రీచార్జ్ ప్లాన్ల ధరలను సుమారు 30 శాతం వరకు పెంచే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు వారి ఆదాయన్ని పెంచుకునే పనిలో పడినట్లు సమాచారం. అయితే రిలయన్స్ జియో కంపెనీ మాత్రం టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ తెలిపింది.