ఏపీ: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ నెల 29న ఆయన విశాఖపట్నంలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభం కానున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కొత్త ఒరవడి సృష్టిస్తారని విశ్వసిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా హబ్‌లతో పాటు ఇతర గ్రీన్ ప్రాజెక్టులు ఈ పార్క్‌లో ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 20 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుండగా, ఈ ప్రాజెక్టులు 48,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటిస్తూ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు.
మోదీ పర్యటనలో రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై ప్రకటనలు ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రిని ఎన్డీఏ నేతలు కోరుతున్నారు.
ఈ పర్యటన సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.