న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చలు జరపనున్నారు.
అన్ని రాష్ట్రాలకు చేయనున్న కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు మరియు చర్యలపై ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే రెండు టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి.
ఈ మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు సార్లు డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబందించి ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ముందుగా ప్రకటించినట్టు మొదట కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు ఇవ్వనున్నారు. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది.