జాతీయం: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. బీహార్ మధుబనిలో జరిగిన బహిరంగ సభలో ఉగ్రవాదంపై తన ఆగ్రహాన్ని వెల్లడించారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని, న్యాయం జరిగేలా చూస్తామని తేల్చిచెప్పారు.
అయితే మోదీ వ్యాఖ్యల్లోని ఓ విశేషం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సభలో హిందీలో ప్రసంగిస్తున్న మోదీ, ఒక్కసారిగా ఇంగ్లీషులోకి మారారు.
‘‘India will identify every terrorist, trace them and punish them… We will hunt them down to the ends of the Earth’’ అంటూ గంభీరంగా హెచ్చరించారు. ఈ పదాలను ఇంగ్లీషులో ఉద్ఘాటించడం వల్ల అంతర్జాతీయంగా స్పష్టమైన సందేశం వెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కేవలం దేశ ప్రజలకు మాత్రమే కాక, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులకు కూడా సూటిగా చేరాలనే ఉద్దేశ్యంగా ఉన్నట్లు కనిపించింది. భారత్ ఉగ్రవాదంపై ఎంత తీవ్రంగా ఉన్నదీ ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశమే మోదీ భాష మార్పుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అనంతరం మళ్లీ హిందీలోకి మారిన మోదీ, దేశ భద్రత విషయంలో తన ప్రభుత్వం అంకితభావంతో ఉన్నదని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ప్రసంగం ద్వారా మోదీ మరోసారి దేశ ప్రజల్లో భద్రతాపై నమ్మకం పెంచారు. ప్రపంచం ముందు భారత హోదాను గట్టిగా వినిపించారు.