ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా అమెరికన్ ఏఐ రీసెర్చర్, పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం ఎప్పుడూ శాంతి కోరుకుంటుందని, కానీ ప్రతిసారి పాకిస్థాన్ నుంచి శత్రుత్వమే ఎదురవుతోందని అన్నారు.
2014లో తన ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, కానీ ఆశించిన విధంగా సంబంధాలు మెరుగుపడలేదని తెలిపారు. పాకిస్థాన్ ప్రజలు కూడా ఉగ్రవాదం, హింసతో విసిగిపోయారని, వారు శాంతిని కోరుకుంటున్నారని మోదీ అభిప్రాయపడ్డారు.
తన మొదటి పదవీకాలంలో పాక్‌తో మెరుగైన సంబంధాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదని అన్నారు. అయితే, భారత విదేశాంగ విధానం ముమ్మాటికీ శాంతి, సామరస్యానికి కట్టుబడి ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని వివరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను మోదీ ప్రశంసించారు. ట్రంప్‌తో తనకు బలమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు.
2002 గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడుతూ, తప్పుడు కథనాలు ప్రచారం చేశారని మోదీ అన్నారు. ఆ ఘటనకు ముందు గుజరాత్‌లో ఎన్నో అల్లర్లు జరిగాయని, కానీ 2002 తర్వాత ఒక్క అల్లరు కూడా జరగలేదని నొక్కిచెప్పారు.
“సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” సిద్ధాంతంతోనే పని చేస్తున్నామని, న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని మోదీ తెలిపారు. కోర్టులు తనకు క్లీన్ చిట్ ఇచ్చాయని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు.