పట్నా: ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే స్పుత్నిక్ వి, ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది.
ఈ తరుణంలో డీసీజీఐ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇంత త్వరగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం సరైనది కాదని, వ్యాక్సిన్ సామార్థ్యం పట్ల జనాల్లో సందేహాలున్నాయని తెలిపాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ సోమవారం మీడియాతో ఈ విషయంపై మాట్లాడుతూ, ‘కరోనావైరస్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతివ్వడం వల్ల ప్రజల్లో తలెత్తిన సందేహాలు తొలగించడానికి రష్యా, అమెరికా ప్రధానులు బహిరంగంగా తొలి డోస్ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. వారిలానే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా కోవాగ్జిన్ తొలి డోస్‌ని జనం మధ్యలో తీసుకోవాలి.
అలా చేస్తే వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగిపోతాయి, అన్నారు. ఇంకా మోదీతో పాటు మరి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు కుడా తొలుత వ్యాక్సిన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.