మూవీడెస్క్: ఈ ఏడాది అన్ని చిత్ర పరిశ్రమలు పలు అంచనాల చిత్రాలను విడుదల చేసినప్పటికీ, మలయాళం ఇండస్ట్రీ మాత్రం భారీ నష్టాలను చవిచూసినట్లు తాజాగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ప్రకటించింది.
2024లో మోలీవుడ్లో 199 చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా, వాటిలో కేవలం 26 చిత్రాలే హిట్ అయ్యాయి.
దీంతో ఈ ఏడాదిలో రూ.700 కోట్ల నష్టం ఎదుర్కొన్నామని నిర్మాతల సంఘం వెల్లడించింది.
199 సినిమాల నిర్మాణానికి మోలీవుడ్లో రూ.1000 కోట్లు ఖర్చు చేయగా, తుది వసూళ్ల రూపంలో కేవలం రూ.300 కోట్లకే పరిమితమైందని అసోసియేషన్ తెలిపింది.
భారీగా పెరిగిన ప్రొడక్షన్ ఖర్చులు, నటీనటుల రెమ్యూనరేషన్లు కూడా నష్టానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
పైగా, కొన్నిచిత్రాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోవడం కూడా పరిశ్రమకు ప్రతికూలంగా మారింది.
అయితే, ముంజుమ్మల్ బాయ్స్ వంటి బ్లాక్ బస్టర్ రూ.240 కోట్ల గ్రాస్ రాబట్టి 2024లో మోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఆడు జీవితం, ఎ.ఆర్.ఎం, ప్రేమలు వంటి చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో విజయవంతమయ్యాయి.
డబ్బింగ్ చిత్రాలుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సినిమాలు మంచి ఆదరణ పొందాయి.
మొత్తానికి, 2024 మలయాళంలో విజయాలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరంగా పరిశ్రమకు ఇది కష్టసమయం అని చెప్పుకోవచ్చు.
2025లో మంచి కథలు, బడ్జెట్ నియంత్రణతో పరిశ్రమ తిరిగి పుంజుకుంటుందనే ఆశాభావంతో ఉంది.