వాషింగ్టన్: యావత్ ప్రపంచం ఇప్పటికీ కరోనా వైరస్ యొక్క వివిధ వేరియంట్లతో అతలాకుతలం చేస్తుంటే, తాజాగా అమెరికాలో అరుదైన మంకీ పాక్స్ వైరస్ కేసు బయట పడింది. సుమారు 20 సంవత్సరాల తరువాత తొలిసారి అమెరికాలోని టెక్సాస్‌లో మంకీ పాక్స్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది.
ఈ వ్యాధి బాధితుడు కొన్ని రోజుల ముందు నైజీరియాకు వెళ్లి తిరిగి వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం అతను డల్లాస్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందువల్ల ఈ రోగితో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణికులను మరియు ఇతరులపై దృష్టిపెట్టారు.
కాగా స్మాల్ పాక్స్ వైరస్‌కి సంబంధించినదిగా భావిస్తున్న ఈ మంకీ పాక్స్ వల్ల పెద్దగా ఆందోళన అవసరం లేదని, ఇది సాధారణ ప్రజలకు అంతగా ముప్పు ఉండదని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. తుంపర్ల వల్ల కూడా ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే ప్రమాదం ఉన్నా ప్రజలు కరోనా కారణంగా మాస్కులు వాడుతున్నందున అంత త్వరగా వ్యాప్తి చెందకపోవచ్చని సీడీసీ వెల్లడించింది.
2003లో యూఎస్ లో తొలిసారిగా 47 మందికి ఈ వైరస్ సోకిందని, మిడ్‌వెస్ట్‌లోని పెంపుడు జంతువుల ప్రేరీ కుక్కలు, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల ద్వారా వైరస్ అప్పట్లో వ్యాప్తి చెందింది. అయితే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం మంకీపాక్స్ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరల్ వ్యాధి అని తెలిపింది.