తెలంగాణ: మూసీ ప్రక్షాళన: రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు కౌంటర్
మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కఠినంగా స్పందించారు. మూసీ శుద్ధి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ‘లూటిఫికేషన్’ చేపట్టిందని ఎద్దేవా చేశారు. గురువారం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ, శుక్రవారం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రణాళికలను వివరించారు.
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాపమే మూసీ మురికికూపం
మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని కేటీఆర్ ఆరోపించారు. తాము మూసీకి కరకట్టలతో కాపాడేందుకు కృషి చేశామని, 16,634 కోట్లతో ప్రక్షాళన కోసం డీపీఆర్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కానీ, రేవంత్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రాజెక్టును ఢిల్లీకి పంపే మాయాజాలం చేస్తున్నదని ఆరోపించారు.
రేవంత్ ఆజ్ఞానం బయటపెట్టుకున్నాడు
రేవంత్ ఇచ్చిన ప్రజెంటేషన్ తాము ఏమి చేశామో చూపించే ప్రయత్నంగా కాకుండా, పూర్తిగా అజ్ఞానం చాటిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సర్వేలు చేయకుండానే మాట్లాడడం, అసంబద్ధ ఆరోపణలు చేయడం సీఎం రేవంత్ అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. నిజానికి, మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారని కేటీఆర్ వివరించారు.
గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్ధాలు
రేవంత్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీపై ప్రేమ చూపించడం ఢిల్లీకి పంపే మూటల కోసమేనని, లక్షన్నర కోట్ల కుంభకోణం కాంగ్రెస్ నేతల ప్రణాళికలో ఉందని మండిపడ్డారు.
మూసీకి 70% పారిశ్రామిక వ్యర్థాలు
మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం ప్రతిజ్ఞబద్ధంగా కృషి చేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
‘మీరు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. 420 హామీలతో ప్రజల గొంతు కోశారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయింది’ అని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై నల్గొండ మంత్రులు జ్ఞానం పెంచుకోవాలంటూ హితవు పలికారు.