న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంక్ కి ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది.
బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆర్బీఐ ఆహ్వానిస్తోంది.
అభ్యంతరాలు, సూచనలు 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్‌బీఐ తెలిపింది. కాగా లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. నవంబరు 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్‌బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం.