న్యూఢిల్లీ: అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించి తన తాజా నివేదికను విడుదల చేసింది. తన నివేదికలో అత్యధిక జనామోదం పొందిన నాయకుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని అగ్రదేశాల నేతలందరికన్నా మోడి ముందు వరుసలో ఉన్నారు.
పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్ రష్యా, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్ వంటి 13 దేశాల నాయకులందరినీ తోసిరాజని నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. జూన్ 17వ తేదీన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఈ ఫలితాలు విడుదల చేసారు. కాగా ఈ సర్వేలో ఇండియాలో 2,126 మందిపై సర్వే నిర్వహించారు. ఇందులో 66 శాతం మంది, మోదీ నాయకత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఈ సర్వేలో మోదీ తరువాత స్థానంలో ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి ఉన్నారు. ఆయనకు వచ్చిన రేటింగ్ 65 శాతం. అంటే ఒక్క శాతం మాత్రమే తేడా. తరువాత మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతంతో ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన్ను 53 శాతం మంది ఎంచుకున్నారు.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు.