అమరావతి: దేశం మొత్తం మీద కరోనా పై పోరాడడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
కాగా దేశంలో థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన తల్లులకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా సదరు తల్లుల జాబితాను సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒకరోజు ముందుగానే టోకెన్లు పంపిణీ కూడా చేయాలని తెలిపింది.
వాళ్ళకు ఇచ్చిన టోకన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వారిని ఆ సమయానికి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేసేలా చూడాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.
5 ఏళ్ల లోపు చిన్నారులతో పాటు ఉన్న తల్లులకి వ్యాక్సిన్ వేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. అర్హులైన తల్లులు 15 నుంచి 20 లక్షల మంది ఉంటారని అంచనా. ఒక వేళ థర్డ్ వేవ్ లో పిల్లలు ఆసుపత్రి పాలైతే ఆ చిన్నారులతోపాటు వారి తల్లులను సహాయకులుగా ఉంచాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చింది.