టాలీవుడ్: శత్రువు, ఒక్కడు, వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే సినిమాలతో నిర్మాతగా టాలీవుడ్ లో టాప్ పొజిషన్ చూసి ఆ తర్వాత వరుస ప్లాపులతో కొంచెం వెనకబడిపోయాడు నిర్మాత ఎం.ఎస్.రాజు. దర్శకుడిగా కొన్ని సినిమాలు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు అందలేదు. రీసెంట్ గా ‘డర్టీ హరి’ అనే థ్రిల్లర్ సినిమా రూపొందించారు. అడల్ట్ కంటెంట్ తో పాటు థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా పరవాలేదనిపించింది. ప్రస్తుతం ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేసారు.
‘7 డేస్, 6 నైట్స్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ టైటిల్ తో పాటు ఒక ఐలాండ్ లో రెండు బోట్స్ తో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. టైటిల్ ని బట్టి చూస్తే హాలిడే ప్యాకెజీస్ కి ఇలాంటి వర్డింగ్స్ ఉంటాయి. ఒక రకంగా హనీ మూన్ లేదా హాలిడే ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుని హాలిడే ని ఎంజాయ్ చేయడానికి వెళ్లిన జంట లేదా జంటల మధ్య జరిగే రొమాన్స్ మరియు అందులో థ్రిల్లర్ కాన్సెప్ట్ ని జోడించి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి ఎం.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ , ఏ.బి.జి.క్రియేషన్స్ బ్యానర్స్ పై రజినీకాంత్ తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమాలో నటీ నటుల వివరాలు మరి కొద్దీ రోజుల్లో వెల్లడించనున్నారు మేకర్స్.