వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, జనసేన పార్టీలో చేరారు. ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్రాంతికి కండువా కప్పి పార్టీకి స్వాగతం పలికారు. క్రాంతితో పాటు ఆమె భర్త కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే గుంటూరు కార్పొరేషన్ లోని కొందరు కార్పొరేటర్లు, జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు, పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచిలు కూడా జనసేనలో చేరారు. వీరందరికీ పవన్ కల్యాణ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “జనసేనలోకి చేరికలు ప్రజల్లో తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనం,” అని అన్నారు. గ్రామాభివృద్ధికి ఉత్సాహం ఇచ్చేలా పల్లె పండుగ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు.
ముద్రగడ పద్మనాభం గతంలో పవన్ కల్యాణ్ పై కొన్ని విమర్శలు చేసినప్పటికీ, ఆయన కుమార్తె క్రాంతి బహిరంగంగా పవన్ కు మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా, పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పేర్కొన్నారు. పవన్ విజయం సాధించడంతో, ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్లు గెజిట్ ద్వారా తెలిపారు.