కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేత శత దినోత్సవం పూర్తి చేసుకుంది. పరిస్థితులని చూస్తే ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిచే జాడ కనపడకపోవడం తో చాలామంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ చాలా ఇండస్ట్రీస్ అన్ లాక్ అయినా, షూటింగ్స్ కూడా మొదలుపెట్టినా కూడా థియేటర్స్ కి మాత్రం తెరచుకోవడానికి అనుమతి లభించలేదు. థియేటర్స్ అయితే ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో థియేటర్స్ ను నమ్ముకున్న వారికి మూడు నెలలుగా అవి మూతపడి ఉండడంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అన్ లాక్2.0లో కూడా థియేటర్స్ తెరచుకోవడానికి అనుమతి లభించలేదని, సామాజిక దూరం పాటిస్తూ, జనాలు గుమిగూడకుండా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పినా కూడా అనుమతులు ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా థియేటర్స్ ను నమ్ముకొని లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలల్లో ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. థియేటర్స్ మూతతో నష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో అన్ని రకాల జాగ్రత్తలను తీస్కొని ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్, ఆస్ట్రియా, హాంకాంగ్, దుబాయ్, అమెరికా, బెల్జియం, మలేషియా వంటి దేశాల్లో థియేటర్స్ ఓపెన్ చేశారని..అక్కడ వాటిని అనుమతిచ్చినట్టే దేశంలోనూ ఇవ్వాలని కోరుతున్నామని మల్టీపెక్స్ యజమానులు కోరారు. నాన్ కంటైన్మెంట్ జోన్స్ తో మొదలుకుని మెల్లగా థియేటర్స్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించాలని మల్టీపెక్స్ యజమానులు కోరారు.