అబుదాబి: ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 లో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. లీగ్‌లో 7 మ్యాచ్‌లాడిన రోహిత్ సేన ఐదో విజయంతో ‘టాప్’లోకి వచ్చింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు.
లక్ష్యఛేదనకు దిగిన ముంబై మందకొడిగా ఆట ప్రారంభించింది. 3, 4, 5 తొలి మూడు ఓవర్లలో ముంబై చేసిన పరుగులింతే! చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు నాలుగో ఓవర్లో డికాక్ మెరుపులు జతచేశాడు. సీనియస్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ 6, 4 కొట్టాడు. దీంతో మూడు ఓవర్ల పాటు 12/0 స్కోరు కాస్తా ఒక్క ఓవర్లోనే 24/0తో డబుల్ అయ్యింది. కానీ తర్వాత ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్’ రోహిత్ (5)ను అక్షర్ పటేల్ అవుట్‌చేశాడు. మరోవైపు డికాక్ భారీషాట్లు బాదాడు. డికాక్ వేగం పెంచాడు. హర్దిక్ పాండ్యా (0)తో పాటు విజయానికి చేరువలో ఇషాన్ కిషన్ అవుటైనా… కృనాల్ పాండ్యా (12 నాటౌట్), పొలార్డ్ (11) విజయంతో ముగించారు.