అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలోనే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆ ఫలితాల్లో వైఎసార్పీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో మునిసిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఇవాళతో ముగిసింది.
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మున్సిపల్ స్థానిక ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, ఇదే నెల 14వ తేదీన ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే, పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది.