మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంటూ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు.
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బన్నీ పాల్గొని తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక సంగతులను వెల్లడించాడు.
బన్నీ తనకు తొలి రెమ్యునరేషన్ ఇచ్చిన వ్యక్తిగా దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిని గుర్తు చేసుకున్నాడు.
“నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే నన్ను పిలిచి, ‘నిన్ను హీరోను చేస్తాను’ అని చెప్పి 100 రూపాయిలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.
ఇది నా కెరీర్‌లో తొలి రెమ్యునరేషన్. అందుకే నా ఆఫీస్‌లో ఆయన ఫోటో ప్రత్యేకంగా ఉంటుంది,” అని చెప్పారు.
దర్శకుల గురించి మాట్లాడుతూ, “నా నటనకు బలమైన పునాది సుకుమార్. ‘ఆర్య’ సినిమాతో నాకు జీవితంలో ఒక బ్రేక్ ఇచ్చారు.
అలాగే దిల్ రాజు గారు నా కెరీర్‌లో కీలకపాత్ర పోషించారు. గుణశేఖర్ గారి గురించి చెప్పాలి. ఆయనతో చేసిన ‘వరుడు’ పెద్దగా ఆడలేదు.
కానీ ఆయన ‘రుద్రమ్మదేవి’ కోసం 40 కోట్ల రిస్క్ తీసుకున్నారు. అందులోని గెస్ట్ రోల్ చేయడానికి ముందుకు వచ్చినవారెవ్వరూ లేరు. నేను స్వయంగా వెళ్లి ఆ పాత్ర చేశాను,” అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన బంధం గురించి చెప్పిన బన్నీ, “త్రివిక్రమ్ గారు నాకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు.
‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందించారు. ఆయన నా జీవితంలో కీలక భాగం,” అని అభిప్రాయపడ్డారు.
ఇంతటి స్థాయిలో ఉండటానికి తనతో పనిచేసిన దర్శక, నిర్మాతలే కారణమని చెప్పిన బన్నీ, “ఈ రోజున నా ప్రయాణం విజయవంతమవడానికి వారు అందించిన సహకారం అమోఘం,” అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశాడు.