ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంతు చిక్కని ఒక వింత వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి మృతి చెందినట్టు వార్తలు రావడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
గత ఐదు రోజుల నుంచి ప్రజలు అనారోగ్యానికి బలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని, వందల సంఖ్యలో ప్రజలు, చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నా తేలిగ్గా తీసుకుందని నారా లోకేష్ విమర్శించారు. నిర్లక్ష్యం వల్లే ఏలూరు లోని విద్యానగర్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మరణించాడని, ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.
ఇక ఇప్పటికైనా ప్రభుత్వం వింతరోగం, మాస్ హిస్టీరియా అంటూ డ్రామాలు వేయడం మానేసి ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేశారు.