తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ వైపు దృష్టి సారిస్తోంది. పుష్ప 2 భారీ విజయం సాధించి రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో, సంస్థకు భారీ లాభాలు వచ్చాయి.
ఇప్పుడు అదే ఉత్సాహంతో బాలీవుడ్‌లో జాట్, కోలీవుడ్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలను నిర్మిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజున ఏప్రిల్ 10న విడుదల కావడం, మైత్రి భారీ రిస్క్ తీసుకుంటోందన్న అనుమానాలు పెరిగాయి.
జాట్ సినిమాతో మైత్రి, బాలీవుడ్‌లో భారీగా అడుగుపెట్టాలని చూస్తోంది. సన్నీ డియోల్ నటిస్తుండటంతో మంచి క్రేజ్ ఉంది కానీ, హిందీ మార్కెట్‌లో మాస్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండటంతో సినిమా ఫలితం పై అనుమానాలు నెలకొన్నాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలోనూ అజిత్ కెరీర్ ఇటీవల బాగా ప్రభావితం కావడంతో, ఇది మైత్రికి మరో పెద్ద పరీక్షగా మారింది. ఒకేసారి రెండు భారీ సినిమాలను విడుదల చేయడం వల్ల ఒకదానికొకటి పోటీగా మారే అవకాశం ఉంది.
తెలుగులో వరుస విజయాలతో మైత్రి మంచి లాభాల్లో ఉంది కానీ, పరభాషల్లో ఇలాంటి భారీ పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ స్థిరంగా లేకపోవడం, ప్రమోషన్లు తక్కువగా ఉండటం మైత్రికి మైనస్ అవ్వొచ్చు. ఏప్రిల్ 10 ఈ సంస్థకు కీలకమైన రోజు కానుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్ అయితే, మైత్రి భారతీయ సినీ పరిశ్రమలో మరింత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.