టాలీవుడ్: 2015 సంవత్సరంలో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాతో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది ‘మైత్రి మూవీ మేకర్స్’. నవీన్ యెర్నేని, రవి శంకర్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి ఈ బ్యానర్ ని మొదలు పెట్టారు. బ్యానర్ పెట్టి మొదటి మూడు సినిమాలు ‘శ్రీమంతుడు’, ‘జనతా గారేజ్’, ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ రేంజ్ బ్లాక్ బస్టర్ లు సాధించి టాప్ బ్యానర్ గా ఎదిగి ఈ బ్యానర్ లో పని చేయడానికి డైరెక్టర్స్, ఆక్టర్స్ ఎదురుచూసే స్టేజ్ కి వచ్చింది. తర్వాత సవ్య సాచి, అమర్ అక్బర్ ఆంథోనీ, డియర్ కామ్రేడ్ లాంటి మీడియం సినిమాల్లో నష్టాలు మరియు ఎదురు దెబ్బలు చూసి మళ్ళీ ఇంకొన్ని హిట్ సినిమాలతో పుంజుకుంది. ఈ సంవత్సరం విడుదలైన ఉప్పెన సినిమాతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి కూడా అడుగుపెట్టింది.
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో దాదాపు టాప్ ఆక్టర్స్ అందరి సినిమాలు మేకింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోల అందరి సినిమాలు రానున్న రెండేళ్లలో ఎదో ఒక సినిమా ఈ బ్యానర్ నుండి రాబోతుంది అనడంలో సందేహం లేదు. ఈ బ్యానర్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా రూపొందుతుంది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రానున్న ‘సర్కారు వారి పాట’ మైత్రి బ్యానర్ లోనే వస్తుంది. పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఈ బ్యానర్లోనే రూపొందనుంది. జూనియర్ ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కూడా మైత్రి బ్యానర్ లోనే రాబోతుంది.
ఇవే కాకుండా విజయ్ దేవరకొండ – సుకుమార్ మూవీ, నాని ‘అంటే సుందరానికి’ సినిమాలు కూడా మైత్రి బ్యానర్ లోనే రానున్నాయి. ఇలాంటి పాండెమిక్ టైం లో కూడా టాప్ ఆక్టర్స్, టాప్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి సంవత్సరాల తరబడి ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద పెద్ద బ్యానర్ లని తలదన్నేలా మైత్రి మూవీ మేకర్స్ మంచి ప్లానింగ్ తో దూసుకువెళ్తున్నారు. ఇలాగే ఇండస్ట్రీ తలెత్తుకునే సినిమాలు రూపొందించి సూపర్ హిట్ సినిమాలని అందించాలని ఆశిద్దాం.