ఏపీ: పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జయకేతనం సభకు జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, మాజీ సీఎం జగన్‌పై సెటైర్లు వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ రాబోయే ఎన్నికల్లో గెలుస్తానని కలలు కంటున్నారని, ఆయన కన్నా హాస్యం పండించేవారు లేరని ఎద్దేవా చేశారు.
ఒక్క క్షణంలో తొమ్మిది నెలలు గడిచినట్టు, కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్లు దాటిపోయినట్టు జగన్ కలగంటున్నారని నాగబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం వచ్చిందని అహంకారంతో మాట్లాడవద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. గతంలో వైసీపీ నేతలు నోటి దురుసుతోనే ప్రజల మద్దతు కోల్పోయారని గుర్తు చేశారు. జనసేనలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని, ఆయన రాబోయే తరాలకు మంచి పాలన అందించగల నాయకుడని నాగబాబు అన్నారు. దేవుడు అడిగితే వరమిస్తాడని, పవన్ అడగకుండానే ప్రజల కోసం పని చేస్తాడని ప్రశంసించారు. 12 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగిన పవన్, రాష్ట్రానికి స్వర్ణయుగం తీసుకువస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
పిఠాపురం విజయానికి ఎవరో వ్యక్తిగతంగా కారణమని భావించడం మూర్ఖత్వమని నాగబాబు తేల్చి చెప్పారు. పవన్ విజయం ప్రజల ఆశీస్సుల వల్ల సాధ్యమైందని, జనసేన పోరాటం ఏపీని కొత్త దిశలో తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన భవిష్యత్తు లక్ష్యాలు, రాజకీయ ప్రస్థానం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, పార్టీ శ్రేణులకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.