అమరావతి: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు – పవన్ స్పష్టత
నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి – పవన్ స్పష్టత
జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు అయింది. శాసనసభ్యుల కోటాలో జనసేనకు కేటాయించిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయనను ఎంపిక చేసినట్టు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జరిగిన సంప్రదింపుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
నామినేషన్ దాఖలుకు సిద్ధమైన జనసేన
నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగబాబు త్వరలోనే అధికారికంగా నామినేషన్ సమర్పించనున్నారు.
రాజ్యసభ ఊహాగానాలకు తెర
గత కొద్ది రోజులుగా నాగబాబు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కానున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా టీడీపీకి కేటాయించిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయనను ఎంపిక చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయాలని సూచించడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.
మంత్రి పదవి కోసమేనా?
ఇప్పటికే టీడీపీ, బీజేపీ కూటమి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయగా, జనసేనకు ఎమ్మెల్సీ స్థానం లభించింది. చంద్రబాబు నాయుడు గతంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకొస్తామని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్ కావడంతో నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.