టాలీవుడ్: చందమామ కథలు సినిమాతో పరిచయం అయ్యి ఊహలు గుసగుసలాడే సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతున్న హీరో నాగ శౌర్య. ఇప్పటి వరకు చాలా వరకు ఫామిలీ మూవీస్ లవ్ స్టోరీస్ చేసాడు. మధ్యలో యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఇంకొన్ని ప్రయత్నాలు చేసాడు చేస్తున్నాడు. కానీ వాటి మోజులో పడి తనకి కలిసి వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ ని వొదులుకోకుండా మరొక లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో నాగ శౌర్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు ‘వరుడు కావలెను’ అని ఇవాల ప్రకటిస్తూ ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేసారు.
మా అపరంజి బొమ్మకు తగిన వరుడుకావలెను. ఎలా ఉండాలి అంటే….ఇదిగో… ఇలా….టీజర్ విడుదల చేసారు. ఆ అపరంజి బొమ్మగా పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ నటిస్తుంది. టీజర్ ని బట్టి చూస్తే ఇది పక్కా లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ లాగ కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా లక్ష్మి సౌజన్య అనే నూతన లేడీ డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వినసొంపుగా వుంది. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలకి సంగీతం అందించిన విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. 2021 వేసవి లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు కూడా ఈ టీజర్ లో ప్రకటించారు.