టాలీవుడ్: కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు తన నట విశ్వరూపం చూపించిన అద్భుతమైన సినిమాల్లో ‘నర్తనశాల’ ఒకటి. అదే చిత్రాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో అప్పట్లో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కానీ చాలా కారణాల వలన ఆ సినిమా ఆలస్యం అవుతూ అవుతూ చివరికి ఆగిపోయింది. 2004 సంవత్సరంలో బాలయ్య తన డ్రీం ప్రాజెక్ట్ గా ఈ సినిమాని ప్రారంభించాడు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపతి గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. కొంచెం షూట్ చేసిన తర్వాత సౌందర్య మరణించడం.. ఇంకొన్ని రోజుల తర్వాత బాలకృష్ణ ఇంట్లో జరిగిన కొన్ని విషయాల వలన బాలకృష్ణ జైలు కి వెళ్లడం లాంటి అవాంతరాల వలన సినిమా షూటింగ్ మొత్తానికి నిలిచిపోయింది.
అయితే అపుడు షూట్ చేసిన కొంత భాగాన్ని ఒక 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలని దసరా సందర్భంగా ఈ నెల 24 నుండి శ్రేయాస్ ET ద్వారా విడుదల చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ తన ఫేస్బుక్ అక్కౌంట్ ద్వారా ‘నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి ‘నర్తనశాల’. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ ‘నర్తనశాల’ చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం ఛారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను.’ అంటూ ఈ సినిమా గురించి చెప్పారు. అలాగే ఈ సినిమాకి సంబందించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేయబోతున్నట్టు కూడా తెలిపారు.