ఏపీ: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై మరో కేసు నమోదు కావడంతో, ఆయన సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేష్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, కొత్త కేసులో చిక్కుకోవడంతో కోర్టుకు హాజరై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
రాజధాని అమరావతికి వ్యతిరేకంగా నందిగం సురేష్ అప్పట్లో మూడురాజధానుల ఉద్యమాన్ని నడిపించారు. ఈ క్రమంలో అమరావతి రైతుల మధ్య వివాదం తలెత్తింది. ఉద్యమ సమయంలో నందిగం సురేష్ ఒక మహిళా రైతు మండవ మహాలక్ష్మిపై దూషణలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
2020లోనే ఆమె ఫిర్యాదు చేసినా, వైసీపీ హయాంలో కేసు ముందుకు సాగలేదు. తాజాగా, మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో మహాలక్ష్మి మళ్లీ ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న నందిగం సురేష్ ముందుగానే కోర్టుకు హాజరై లొంగిపోయారు. కోర్టు వాదనలు ముగిసిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.