హైదరాబాద్: భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం జాబిల్లిపై నీటి ఛాయల కోసం దశాబ్దాలపాటు ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1తో చందమామ ఉపరితలంపై, నేల అడుగున కూడా నీరు ఉండే అవకాశముందని స్పష్టమైంది. కానీ ఏ రూపంలో? ఎక్కడ? ఎంత? అన్న ప్రశ్నలకు అప్పట్లో సమాధానాలు దొరకలేదు.
ఈ లోటును ఇప్పుడు నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు పూర్తి చేసింది. స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ అస్ట్రానమీ, క్లుప్తంగా సోఫియా అని పిలిచే ఈ టెలిస్కోపు భూమికి 40 వేల అడుగుల ఎత్తులో పరారుణ కాంతి ద్వారా విశ్వాన్ని పరిశీలిస్తుంది. నక్షత్రాల జననం, మరణం మొదలుకొని అంతరిక్షంలో సంక్లిష్టమైన అణువులను గుర్తించేందుకు దీన్ని వాడుతుంటారు.
ఇదే క్రమంలో సోఫియా జాబిల్లిపై కూడా కొన్ని పరిశీలనలు చేసింది. ఆ సమాచారం ఆధారంగా జాబిల్లిపై సూర్యుడి వెలుతురు పడే ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ అంశానికి సంబంధించిన వివరాలను తెలిపాయి.
సోఫియా సేకరించిన సమాచారం ఆధారంగా ద్రవ రూపంలో ఉండే నీటి తాలూకూ ప్రత్యేక గుర్తులను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తాము గుర్తించామని, ప్రతి ఘనపు అడుగు జాబిల్లి మట్టిలో సుమారు 12 ఔన్స్‌ల నీరు ఉన్నట్లు తెలిసిందని నాసా శాస్త్రవేత్త కేసీ హానిబల్ నిర్వహించిన పరిశోధన తెలిపింది.
జాబిల్లిపై సులువుగా సేకరించగలిగేలా నీరు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాసా ఇంకో పదేళ్లలో అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు వ్యోమగాముల కోసం ఇక్కడి నుంచి నీరు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రాకెట్ల బరువు, తద్వారా ప్రయోగ ఖర్చులూ గణనీయంగా తగ్గుతాయి.