కోలీవుడ్: కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. మొన్ననే అమ్మోరు తల్లి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ నుండి మరొక వైవిధ్యమైన సినిమా రాబోతుంది. వివిధ రకాల కథల్ని ట్రై చేస్తూ ప్రతీ సారి స్క్రీన్ పైన కొత్తగా కనిపిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ అభిమానులకి బోర్ కొట్టకుండా వివిధ రకాల ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ లని పోషిస్తూ టాప్ స్టార్ గా దూసుకెళ్తుంది నయనతార. ఇందులో నయనతార ఒక అంధురాలిగా నటిస్తుంది. ‘నెట్రికాన్’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది, ‘నెట్రికాన్’ అంటే మూడవ కన్ను అని అర్ధం. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఈరోజు విడుదల అయింది. టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది. ఒక అంధురాలైన అమ్మాయి ఒక సైకో ని ఎలా పట్టుకుంది అనేది సినిమా కథ అన్నట్టు ట్రైలర్ చూస్తే అనిపించింది. ఈ రోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు.
టీజర్ లో అంధురాలైన నయనతార సైకో కిల్లర్ ని వెంటాడడం చూపించారు. అందర్నీ తన వలలో వేసుకొని టార్చర్ చేసే సైకో కిల్లర్ ని వలలోకి దింపి మరీ ఎలా పట్టుకుంది అనే అవుట్ లైన్ టీజర్ ద్వారా రివీల్ చేసారు. ఈ సినిమా ద్వారా ‘నేను రౌడీ నే’ డైరెక్టర్ విగ్నేష్ శివన్ నిర్మాతగా కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతున్నాడు. తన హిట్ సినిమా పేరు మీదనే ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్ ని స్థాపించి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ‘గృహం’ సినిమా ద్వారా ఆకట్టుకున్న మిలింద్ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డిఓపి రాజశేఖర్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగానే ఉంది.